Tuesday, December 22, 2015

బస్తీ మే సవాల్‌: ఆడు మగాడ్రా బుజ్జీ

ఒక్కడే, పైగా సామాన్యుడిగా రాజకీయాల్లోకొచ్చి, సంచలనాలు సృష్టించేస్తున్నాడు.. కాంగ్రెస్‌ కుదేలయ్యింది.. బీజేపీ చావు దెబ్బ తింది అతని చేతిలో. కేంద్రాన్నే వణికించేస్తున్న అతను అసామాన్యుడు. అవును, అతనే 'సామాన్యుడి' పార్టీ 'ఆమ్‌ ఆద్మీ పార్టీ' అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌. మొన్న సీబీఐ దాడుల నేపథ్యంలో నరేంద్రమోడీని ట్విట్టర్‌లో 'ఏసుకున్న' కేజ్రీవాల్‌, ఇప్పుడు ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీతో పంచాయితీ పెట్టుకున్నారు. 'ఢిల్లీ క్రికెట్‌' వివాదంలో అరవింద్‌ కేజ్రీవాల్‌, అరుణ్‌ జైట్లీని నిండా ముంచేశారు. పలువురు క్రికెటర్లు అరుణ్‌ జైట్లీకి మద్దతిచ్చినా, కేజ్రీవాల్‌పై అరుణ్‌ జైట్లీ 'పరువు నష్టం దావా' వేసినా, కేజ్రీవాల్‌దే ప్రస్తుతానికి పై చేయి. 'నువ్వేమన్నా చేస్కో.. నేను అనాలనుకున్నది అనేస్తా..' అనే నైజం అరవింద్‌ కేజ్రీవాల్‌ది. అయినా, పరువు నష్టం కేసులో అరవింద్‌ కేజ్రీవాల్‌కి కొత్తేమీ కాదు. రాజకీయాల్లోకి సంచలనంలా దూసుకొచ్చిన కేజ్రీవాల్‌, ముఖ్యమంత్రి పదవి పట్టుకుని వేలాడాలనుకోలేదు. అందుకే తొలిసారి దక్కిన ముఖ్యమంత్రి పదవిని వదిలేసుకున్నారు.. ఎందరెన్నిరకాలుగా అనుకున్నా, అతని స్ట్రాటజీనే కరెక్ట్‌ అని తేలింది. ఫలితం, రెండోసారి బంపర్‌ మెజార్టీ. ఇప్పుడూ కేజ్రీవాల్‌ ఆలోచన, 'కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి' అనే రీతిలోనే సాగుతోంది. ఢిల్లీ అసెంబ్లీ కాదు.. పార్లమెంటు టార్గెట్‌.. అనుకుంటున్నట్టున్నారు కేజ్రీవాల్‌. ఆ దిశగానే ఆయన వ్యూహాలు సాగుతున్నాయి. అరుణ్‌ జైట్లీ వేసిన పరువు నష్టం దావా కేసులో తన తరఫున వాదనలు విన్పించేందుకు సీనియర్‌ అడ్వొకేట్‌ రామ్‌ జెఠ్మలానీని నియమించుకున్నారు కేజ్రీవాల్‌. ఇంకేముంది, అరుణ్‌ జైట్లీ శిబిరంలో టెన్షన్‌ షురూ. ఈ కేసు గనుక కేజ్రీవాల్‌ నెగ్గితే, అరుణ్‌ జైట్లీ మానసికంగా, రాజకీయంగా దెబ్బతిన్నట్టే. వాస్తవానికి కేజ్రీవాల్‌ టార్గెట్‌ అరుణ్‌ జైట్లీ కానే కాదు. కానీ, అరుణ్‌ జైట్లీని కార్నర్‌ చేశారు కేజ్రీవాల్‌. తద్వారా ఆయనకు విపరీతమైన పాపులారిటీ వచ్చేసిందన్నది నిర్వివాదాంశం. మొత్తమ్మీద, 'ఆడు మగాడ్రా బుజ్జీ..' అని అంతా అనుకునేలా చేయగలుగుతున్న కేజ్రీవాల్‌.. ఏమో, భవిష్యత్తులో దేశ రాజకీయాలపై తనదైన ముద్ర వేస్తారేమో.! వేసినా వెయ్యొచ్చు.. ఎందుకంటే ఆయన అరవింద్‌ కేజ్రీవాల్‌. ఎవరికీ అర్థం కాడు, ఎవరి అంచనాలకూ అందడు. అదంతే.

No comments:

Post a Comment